top of page
Writer's pictureRoopa Rani Bussa

నవకెరటము & మల్లికలు



#ప్రేమ #నవకెరటం

పసిడి పసల చిన్నదాన, మనసు మురిసె ప్రేమలోన

కలలు కంటు, సంతసమున చవిచూసితి నీ మోమునె


విరుల సొగసుతో నీ పసి చెంత చేరె తలపులోన

మొగము మెరిసె, కనులు కలిసె వలపు పిలిచె ఆగలేనె


తరుణి తరుణ తరణి అలై ఎగసి దుమికె ప్రీతితోన

వరము వీవు, కరము పట్టి ఏడడుగులు నడువరావె


కోటి వెలుగు కళ్ళలోన సుఖము పొంది గమములోన

ప్రేమ తరణి సాగును హేరాళముగా నీ సరసనె


ఊసులన్ని రూపమొందె ఇంపుగా రాగములోన

చరిత లోన స్థిరముగుండు ఈ మధువుల సౌహార్దమె


#నవచైతన్యము

జగతినేలు ప్రగతి మీరు, చైతన్యపు దిటము మీరు

కోటికాంతి పంచు తీరు నవతరాలు జయము చేరు


విజ్ఞానములనధిగమిస్తూ సంస్కృతులను నిగుడుచు

దేశ పరిఖ్యాతి పెంచు ఆయుధము మేమేననుచు


అన్ని రంగాలలోనూ వెలుగు నింపు శక్తి మీరు

గంభీరపు భావములను మేలుకొలుపు ధ్వనము జోరు


పద ముందుకని ఐక్యమైన బలమె భూమికి లంగరు

ఇతిహాసపు పుటములను తిరిగ వేయు యువత నెత్తురు


పిక్కబెదరు పారద్రోలి ఉత్సాహము పిక్కటిల్లి

సద్బుద్ధుల త్రోవలన్ని ఉద్దరించు రంగవల్లి


#నవకెరెటం #గంగావతరణ


పితామహుల ఉత్తమ గతికై చేసేను ప్రయత్నము

గంగకై తపస్సుజేసి మెప్పించెను అతని దృఢము


సురలోకము నుండి భువికి దిగితె తాళునా నా వడి

గలగలమనుచు ధ్వనములతో గగనస్రవంతి ఉరవడి


శతకోటి జతనములచే ఫలమేమో ఫలియించెను

ధారణిలో అడుగెడు మార్గమేమిటని చింతించెను


సందేహమునకు ఒకటే దారి శివుడి కొరకు తపము

మౌళిని విప్పిన జటిలో నర్తిస్తూ దిగెను సుధము


వరరూపములో భగీరథుడి యాగము ఫలియించగ

హిమశైలను వదిలి పరుగులు తీస్తు వచ్చింది గంగ


#దసర#మల్లికలు

బొమ్మల కొలువుతొ సంబరాల వేడుకలు జరుపుదాం

అర్చనతో అమ్మవారి ఆశీస్సులను పొందుదాం


వాంఛలు తీర్చగ వచ్చును త్రిశూలధారి శైలపుత్రి

జ్యోతిర్మయమగు దీక్ష ప్రసాదించును యోగధాత్రి


అభయమొసగు మా తల్లి పసిడి కాంతుల చంద్రఘంట

హసన్ముఖముదాల్చి అన్నింటా చేతనము అగునట


శాంతి సుఖమును నెలకొల్పెడి వర్చస్సు నీది తల్లి

జనులకు చతుర్విధ పురుషార్థములిచ్చు కల్పవల్లి


అన్ని భయాలను పారద్రోలె శుభ ప్రదాయిని దుర్గ

కొలిచెదము భక్తితో నవరాత్రులు నిను దేవి దుర్గ


#నవకెరటం

#చలికాలం

మంచు తేలు గగనములో తారలన్ని మాయమాయె

చల్ల గాలి పరవశములొ యామినమ్మ నందమాయె


గిరులు తరలి సంద్రమొదలి చంద్రుడొచ్చి చెంత నిలిచె

హిమము కురియు వేళలోన వెన్నెలమ్మ వన్నె ఎగచె


ప్రభాకరుడి ప్రభలనంత హేమంతము వశము చేసె

నింగి నిగుడు పగలు తరిగి వెలుగు సడలి నలుపు జేసె


పలాశాలు రాలి పడిన ప్రకృతి అందము చెదరలే

హిమిక కప్పి చినుకు పూస కొమ్మ చివర ముత్యాలే


పగలు రేయి చలువ ముదురి ఋతు ఛాయలు చూప సాగె

చలికాంచెడి కాలమంత మంచుతఱుల రూపమొసగె



18 views0 comments

Recent Posts

See All

Comments


Post: Blog2_Post
bottom of page